కొత్తమీర పెంపకం ఎలా / How to Grow Coriander
కొత్తమీర పెంపకం ఎలా?
ధనియాల ఆకునే, కొత్తిమీర అంటారు!
కూరల్లో రుచికి-సువాసనకు ధనియాల పొడిని,ఆకును విరివిగా వాడతారు!
బయట మార్కెట్లో దొరికే కొత్తిమీర మీద, చాలా పురుగుమందుల అవశేషాలు ఉంటాయి!
మిద్దెతోట పెరటితోట లేనివారు కూడా,చిన్న చిన్న ట్రేలలో కొత్తిమీరను పండించుకోవచ్చు!
కొత్తిమీర ప్రధానంగా, శీతాకాలపు పంట!
తక్కువ నీరు అవసరం!
జాగ్రత్తగా పెంచితే,వానాకాలంలో కూడా పండుతుంది!
ఎండాకాలంలో చాలా కష్టం!
శీతాకాలంలో ధనియాలు పండించి,పండని రెండు కాలాల్లో ధనియాల పొడిని వాడుకుంటారు! అందరికీ తెలుసు కద?
కూరలలో ధనియాల పొడి తప్పనిసరి!
వైద్యంలో కూడా,ధనియాల ప్రాధాన్యత ఎంతో ఉంది!
ధనియాలు గుండ్రంగా ఉంటాయి!
ఒక గింజలో రెండు బీజాలు ఉంటాయి!
కనుక ధనియాలను గట్టిగా రాకితే,రెండు బద్దలుగా విడతాయి!
అన్నింటి లాగే,ధనియాలకు కూడా - మట్టి ఎరువుల మిశ్రమం తయారు చేసుకోవాలి!
మట్టి నాలుగు వంతులు-మాగిన పశువుల ఎరువు ఒకవంతున కలుపుకోవాలి!
కుటుంబ అవసరాలకు తగిన మడిని ఎన్నుకోవాలి!
నెలకు ఒక మడి చొప్పున, స్టెప్ బై స్టెప్ విత్తుకుంటే,కొత్తిమీర ఆకు నిరంతరం వస్తుంది!
ధనియాలను పప్పుగా రుద్దుకుని,మట్టిలో విత్తుకోవాలి!
అర అంగుళం లోతున ,మట్టిలో వేలితో చాళ్లు గీసుకోవాలి!
చాలుకు చాలుకు మద్య , అంగుళం గ్యాప్ ఉంటే చాలు!
విత్తుకు విత్తుకు మద్య , పావు అంగుళం ఎడం ఉంటే చాలు!
విత్తనాలు కాస్తా చిక్కగైనా , పలుచనైనా ప్రమాదం లేదు!
చాళ్లలో విత్తనాలను విత్తిన తరువాత, విత్తనాలను కనపడకుండా పలుచగా మట్టిని కప్పాలి!
తరువాత ఒక పాత గుడ్డను మడిమీద పరిచి,నీరు పెట్టాలి!
గుడ్డ పరిచి నీరు పెడితే, విత్తనాలు నీటి ఫోర్సుకు పైకి తేలవు!
మూడురోజుల తర్వాత, తిరిగి నీరు పలుచగా పెట్టాలి!
ధనియాలు దాదాపుగా తొమ్మిది రోజులకు మొలుస్తాయి!
మొలకలు కనపడగానే, గుడ్డను తీసెయ్యాలి!
తరువాత నాలుగైదు రోజులకు ఒకసారి, పలుచగా నీరు పెట్టాలి!
ధనియాలకు చీడపీడలు తక్కువ!