చేమదుంపలను ఎలా పెంచాలి
చేమదుంపలను మిద్దెతోట లో సులభంగా,ముఖ్యంగా పెంచుకోవాల్సిన ఒక దుంప జాతి..
ఇది ముఖ్యంగా వేడి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది..
వేడి ప్రాంతాలలో లేనివారు షేడ్ కింద కానీ, గ్రీన్ హౌస్ లో కానీ పెంచుకోవచ్చు..
వీటిని మంచు లేని వాతావరణ పరిస్థితుల్లో ఏడాది పొడవునా పెంచుకోవచ్చు..
చేమదుంపలు బంగాళాదుంప మాదిరిగానే భూగర్భంలో పెరిగే కండగలిగిన దుంప..
ఈ మొక్కను దుంపల ద్వారా పెంచుతారు..
ఈ మొక్కను పెంచుకోవడానికి దుంపలను కూరగాయల దుకాణంలో తెచ్చుకోవచ్చు..
తెచ్చిన దుంపలను కొన్నింటిని చీకటి ప్రదేశంలో ఉంచితే మొలకలు వస్తాయి..
మొలకలు వచ్చిన దుంపలను మనకు కావలసిన కుండీలలో నాటుకోవాలి..
అలా మొలకలు రాకపోయినా నేరుగా కూడా దుంపలను నాటుకోవచ్చు..
దుంపలను లోతు ఎక్కువలేని కుండీలలో కూడా నాటుకోవచ్చు..
చేమదుంపలకు తరచూ నీరు పెట్టాలి ..
మట్టిలో తేమ ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి..
దుంపలను మట్టిలో మొలక భాగం పైకి వచ్చేలా పెట్టుకోవాలి..
మట్టిలో ఆరు అంగుళాల లోతులో దుంపలను ఉంచి రెండు మూడు అంగుళాల మట్టితో కప్పాలి..
నీటిలో కూడా చేమదుంపలను పెంచవచ్చు..
వీటిని పెంచడానికి మంచి సేంద్రియ పదార్ధాలతో కూడిన మట్టి కావాలి..
చేమ దుంపలకు అధిక పొటాషియంతో కూడిన సేంద్రియ ఎరువులు, కంపోస్టు లేదా కంపోస్టు టీ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి..
వీటిలో చాలా రకాలు ఉన్నాయి..
కానీ రెండు రకాలు సాధారణంగా అందరికీ అందుబాటులో ఉంటాయి.. అవి పెద్ద దుంపలు, చిన్న దుంపలు..
పెద్ద రకం దుంపలు రుచి ఎక్కువ కలిగి ఉంటాయి..
చేమదుంపల ఆకులను కూడా ఆకుకూరగా వాడుకోవచ్చు..
ఈ ఆకులతో పప్పు, ఉడికించి కూర, కందిపప్పు వేసి ఫ్రై,చేమ ఆకు పొట్లాలు ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు..
ఆకులను కోయడం వలన తిరిగి కొత్త ఆకులు వస్తాయి..
దీనిని మిద్దెతోట లో పెంచుకోవడం వలన ఆకులను,దుంపలను రెండింటినీ వాడుకోవచ్చు..
దుంపలు పరిపక్వత చెందడానికి ఏడు నెలల సమయం పడుతుంది..
కాబట్టి జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం పెంచుకుంటే చేమదుంపలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి..
దుంపలు మట్టిలో నుంచి తీయాలనుకున్నప్పుడు నీటి ని ఇవ్వడం తగ్గించాలి..
ప్రధాన దుంపలు మట్టిలో నుంచి బయటకు రావడం మొదలైనప్పుడు దుంపలను బయటకు తీయవచ్చు..
అన్ని దుంపలను బయటకు తీయనవసరం లేదు..
మనకు కావలసిన దుంపలు తీసుకుని మిగిలిన దుంపలను మరల మట్టిలో ఉంచవచ్చు..
ఈవిధంగా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ..
అన్ని దుంపలను బయటకు తీసి వాటిని ఉపయోగించక పోతే అవి పాడవుతాయి..
అలా చెడిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్ లో ఉంచుకోవాలి..
ఫ్రిజ్ లో ఉంచనవసరం లేకుండా మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకుని మిగిలిన దుంపలను మరల మట్టిలో నే ఉంచడం వలన అవి చెడిపోకుండా ఉంటాయి..
చేమ దుంపలకు చీడపీడలు చాలా తక్కువ..
దీనిలో వచ్చే తెగుళ్ళు అఫిడ్స్ మరియు రెడ్ స్పైడర్ మైట్స్..
అఫిడ్స్ ను నివారించడానికి
పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలి..
నీటిని వేగంగా పిచికారి చేయాలి లేదా సబ్బు ద్రావణం కానీ బేకింగ్ సోడా ద్రావణం కానీ, వేపనూనె కానీ పిచికారి చేయాలి..
రెడ్ స్పైడర్ మైట్స్ ను నివారించడానికి
వీటిని రాకుండా ఉంచడానికి మొక్కల చుట్టూ ఉన్న ప్రదేశంలో చెత్త చెదారం లేకుండా ఉంచుకోవాలి..
మొక్కలకు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి..
ఇవి పొడి వాతావరణాలను ఇష్టపడుతాయి కాబట్టి ఇవి రాకుండా ఉంచడానికి నీరు సహాయపడుతుంది..
లేదా వేపనూనె పిచికారి చేయాలి..
చేమ దుంపలకు వచ్చే ప్రధాన వ్యాధులు ఆకుముడత, బూజు తెగులు
ఆకుముడతకు పసుపు, వెల్లుల్లి ద్రావణం, లేదా పుల్ల మజ్జిగ, వెల్లుల్లి ద్రావణం,లేదా వేపనూనె వారంలో రెండుసార్లు ముడత పోయేవరకు పిచికారి చేయాలి..
బూజు తెగులు రాకుండా పాలు నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా పుల్ల మజ్జిగ, ఇంగువ ద్రావణాన్ని పిచికారి చేయాలి..
ఈవిధంగా చేమదుంపలను మిద్దెతోట లో పెంచుకోవచ్చు.
--
లత కృష్ణమూర్తి
Leave your comment